చౌటుప్పల్ తహసీల్దార్కు షోకాజ్ నోటీసు

చౌటుప్పల్ తహసీల్దార్కు షోకాజ్ నోటీసు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ తహసీల్దార్​ మీరాబాయికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. చౌటుప్పల్​ మండలం తూప్రాన్​పేటలోని సర్వే  నెంబర్లు 13, 14 లోని 5.5 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమిని రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా చౌటుప్పల్​ సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుకు వెళ్లగా ఈడీ కేసుల కారణంగా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్​ చేయబోమని రిజిస్ట్రార్​ చెప్పినట్టు తెలిసింది.

ఈ భూమిపై నిషేధం లేదని తమకు తహసీల్దార్​ ఆఫీస్​ నుంచి సమాచారం ఉందని, మీరు ఎందుకు చేయడం లేదంటూ రిజిస్ట్రేషన్​ కోసం వచ్చిన వ్యక్తులు గొడవకు దిగినట్టుగా సమాచారం. ఈ పరిణామంతో రూ. కోట్ల విలువైన 5.5 ఎకరాల భూమి విషయాన్ని రిజిస్ట్రార్​ సీసీఎల్​ఏకు సమాచారం అందించారు. అక్కడి నుంచి జిల్లాలోని హయ్యర్​ ఆఫీసర్లకు ఆదేశాలు రావడంతో తహసీల్దార్​ మీరాబాయికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. 22 ఏ (1) (ఇ)లో ఈ భూమి వివరాలు ఎందుకు చేర్చలేదని నోటీసుల్లో పేర్కొన్నట్టుగా సమాచారం.